Saturday, July 3, 2010

పిచుక (The Indian Sparrow)



నాకంటా పెద్ద కతల్లేవుగాని, తెలుగింట నేను తెలీనోడు లేడయ్యో.....
ముష్తోడి కాడ్నుంచి రాజు దంక, కూలోడి కాడ్నుంచి రైతు దంక
పాములోడ్నించి యాటగాడి దంక, పిల్లకాయల్నించి పండుముసలి దంక
అందరికీ నేనేరికనే.....

కోయిలమ్మంత పాడలేక పోయినా,
చిలకమ్మంత చక్కంగ లేకపోయినా,
పాలపిట్టంత సొగసు లేకున్నా,
ఉడుతంత చెంగుచెంగున గెంతలేకున్నా,
........ఆళ్ళoత నా నేస్తాలే !

పిల్లిబావకి ఒళ్ళుమంట, నా గూట్లో గుడ్లు వాడికందవని,
కోడి మావకి కడుపుమంట, వరికొట్టం చూరులో నేనొక్కటే పడతనని
బాతుబాబుకి కుళ్ళు, నాలా ఎగరలేడని
..........ఎందుకంత కోపం ?

చిట్టిదాన్నైనా, చిలిపి దాన్ని......మట్టిరంగులో ఉన్నా, మనసున్నదాన్ని !
మేకపిల్లలపై షికార్లు, చిటారుకొమ్మపై కున్డుడుగుమ్మలు, నీళ్ళ గుంటల్లో స్నానాలు........నా ఆనందాలు.
ఏటిగట్టున మేస్తున్న దున్నపోతు మీదున్న నత్తగుల్లలు తింటూ మారాజులా ఊరేగుతను.

పిచ్చికపై బ్రహ్మాస్త్రం ఏంటని సామెతంట !
ఇందరుడెప్పుడు నాపైన ఇసిరిండో గుర్తులేదుగాని
పాలకంకుల జొన్నచేలో పాలేరిసిరిన ఒడిసె,
ఒడియాలకి కాపలా పిల్లాడిసిరిన రాయి నన్ను తగల్లేదు
యాటగాడేసిన వల్లో పడ్డనుగాని ఎలకన్న ఇడిపించిండు

రాజ్యాలు మారినై....ఋతువులు మారినై....
ఎండోచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా సమత్సరాలు బతికేసినాను ఆ రోజుల్లో....
కరువోచ్చినా కాటకమోచ్చినా రైతన్న ఉండేవోడు
గూటికోసం చెట్టో మానో.... కూటికోసం గింజో గారికో ఉండేది.....
ఏటికోసారి ఏడికైన పోదామంటే... ఏటిగట్టున యిసకదిబ్బో , అడివిచివర మర్రిమానో, కొండమీద కోయగుహలో ఉండనే ఉండె....

తిండి గింజల్లేవు....అంత కరవులాయే
గడ్డి పోచల్లేవు......అన్నీ ప్లాస్టీకు కవర్లే మరి
మట్టి వాసన రానే రాదు.......అంతా బండలే మరి
కళ్ళాపి ముగ్గులు కానరావు......అంతా తార్రోడ్లే మరి
పల్లెటూళ్ళు లేవు......అన్నీ పట్నలే మరి
కొట్టాల్లేవు, వాసాల్లేవు, గడ్డివాముల్లేవు,తాటిచెట్లూ లేవు......గూడే లేదు నాకు, ఉండేదేక్కడ !
పొలాల్లో పురుగులు గాదు గింజలుగూడ లేవాయే......
మిగులు నూకలు ఇసిరేసేదెవురు, మనుషులకే ముద్ద లేదాయె......
అడివిగింజలైన తిందామంటే, అడివిగాదు ఆకుగూడ కానరాదాయే.......కూడే లేదు నాకు, బతికేదిoకెట్ట !

పిల్లకాయల పుస్తకాల్లో బొమ్మలున్నై నాయి......పెద్దాళ్ళ మనసుల్లో గాపకలున్నై నాయి.
నేనేదో చిట్టిదాన్ని, ఒంటరిదాన్ని, చేతకాని దాన్ని......పెద్దోళ్ళు మీరు, ఒకరికి ఒందమంది ఉన్నరు, చేతనైన చవగలిగినోల్లు......
మీరైన ఈ నేలతల్లిని కాయదండయ్య......
ఎన్నాళ్లున్తనో ఏరికలేదుగాని, అంతా చల్లన్గుంటేగాని నా కంటికి కునుక !