Showing posts with label street children. Show all posts
Showing posts with label street children. Show all posts

Saturday, January 29, 2011

నేను, నా ఈ జీవితం....

నా మరదలు రాసిన కవిత ఆధారంగా రాసిన ఊహా గానం ఇది...
చెత్తలో చిత్తుకాగితాలు ఏరుకునే ఒక చిన్న పిల్ల ఆలోచనలు...
---------------------------------------------------------------------------------------------

నేను, నా ఈ జీవితం....
ఎప్పుడు పుట్టానో తెలీదు, ఎవరికి పుట్టానో తెలీదు..
ఎక్కడ పుట్టానో తెలీదు, ఎందుకు పుట్టానో తెలీదు....

నీడనిచ్చే చెట్టే తల్లిలా అనిపిస్తోంది
తోడు నడిచే చీకటే తండ్రిలా లాలిస్తోంది
చమట చుక్కలు స్నేహితుల్లా పలకరిస్తే, గాలి వాన చుట్టాల్లాగా చూసి వెళ్ళిపోతున్నాయి...

వ్యర్ధమైన నా ఈ జీవితం ఈ వ్యర్ధం పోగుచేయడానికే అంకితం అన్నట్టుంది....
దుమ్ముధూళితో నిండి, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది...
గత జన్మ శాపమో ఈ జన్మ పాపమో అనిపిస్తోంది...
నేను నా ఈ జీవితం.... చిత్తుకాగితాలతో మొదలై చెత్తకుప్పలోనే అంతమవుతుందేమో....!!

నా చెత్త జీవితంలో నేను జాలిపడే చెత్త పిల్లోడు.... సూరీడు
ప్రతి రోజు సూరీడోస్తాడు వెళ్తాడు... ఎక్కడినుంచి వస్తాడో ఎక్కడికెళ్ళి పోతాడో ...??
నా ఆకలి నిద్ర లాగే... పాపం సూరిడిని కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరేమో....
ఒకే కుప్ప నుంచి చెత్తనేరుకునే నాకుమల్లే ప్రతిరోజు ఈ పక్క నుంచి ఆ పక్కకి పోతాడు...
ఆకలేస్తే అక్కడో ఇక్కడో చెత్తలోనే తిండి దొరుకుద్ది నాకు... సూరీడికి తిండెట్టాగో ...
ఎప్పుడైనా ఓ సారి గుడ్డ ముక్క దొరుకుద్ది నాకు... ఎండలో పాపం సూరీడికి నీడెట్టాగో...
నాకు దాహమేస్తే ఏ కోళాయో, దురదలేస్తే ఒళ్ళు రుద్దుకోడానికి కాలవో ఉన్నాయి... పాపం సూరీడికి వానొస్తేనే గదా...
కుక్కలు తరుముకుంటే నేను పరిగెత్తి పారిపోతా... పాపం సూరీడు, మబ్బులు తరుముకున్నా ఏడికీ పోడు...

చెత్తకూడా తెచ్చిపెట్టలేని ఈ సూరీడి గురించి ఆలోచిస్తున్నాను నేను, చెత్తగా...
ఇంకొంచెం చెత్త పోగేస్తే రొట్టెముక్క తిని టీనీళ్ళు తాగచ్చు ఈరోజు...
ఏంటో, నేను, నా ఈ జీవితం.... చిత్తుకాగితాలతో మొదలై చెత్తకుప్పలోనే అంతమవుతుందేమో....!!